Current Affairs In Telugu | May Current Affairs

మే 2019 జాతీయం

వందే భారత్ ప్రయాణం లక్ష కి.మీ. Current Affairsవందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు మూడు నెలల్లో నిరంతరాయంగా ప్రయాణించి మే 15న కాన్పూర్ సమీపంలో కొచ్చే సమయానికి లక్ష కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. దేశంలో అత్యంత వేగం ప్రయాణించే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీలో 2019, ఫిబ్రవరి 15న ప్రారంభించారు. బుల్లెట్ రైలు తరహాలో ఉండే ఈ రైలులో అధునాతన సౌకర్యాలను ఏర్పాటుచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్ష కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేసుకున్న రైలు
ఎప్పుడు : మే 15
ఎవరు : వందే భారత్ ఎక్స్‌ప్రెస్
అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా తషిగానగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని తషిగానగ్ రికార్డు నెలకొల్పింది. సముద్రమట్టానికి 15,256 అడుగుల ఎత్తులో తషిగానగ్ ఉంది. తాజాగా ఇక్కడి పోలింగ్ కేంద్రం మరో ఘనతను సాధించింది. తషిగానగ్‌లో మే 19న ఎన్నికల సందర్భంగా 132 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఊరిలో మొత్తం 49 మంది ఓటర్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు వచ్చిన అధికారులు తషిగానగ్‌లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడంతో మొత్తం 65 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ 132 శాతానికి చేరుకున్నట్లయింది.

యునెస్కో వారసత్వ జాబితాలో మానస సరోవర్
ఐక్యరాజ్యసమితికి చెందిన విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో కైలాస్ మానస సరోవర్‌కు సంబంధించిన భారత భాగాన్ని చేర్చనున్నారు. ఈ మేరకు యునెస్కో అంగీకరించిందని భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మే 19న తెలిపింది. 2019, ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెస్కో వారసత్వ తాత్కాలిక జాబితాలో మానస సరోవర్
ఎప్పుడు : మే 19
ఎవరు : భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ

రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల 
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి తెలిపారు. అందులో భాగంగానే శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌కు నివేదించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషుల విడుదల నిర్ణయం గవర్నర్‌కు ఉందంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని తమిళ సంఘాలు దోషుల విడుదలకు డిమాండ్ చేస్తున్నాయి. అప్పటి ఘటనలో నష్టపోయిన బాధితుల కుటుంబాలు మాత్రం దీనికి అడ్డుపడుతున్నాయి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాజీవ్ హత్యకేసు దోషుల విడుదల కు కట్టుబడి ఉన్నాం
ఎప్పుడు : మే 20
ఎవరు : తమిళనాడు ముఖ్యమంత్రి కె. ఫళనిస్వామి

పర్యాటక స్థలాల్లో స్తన్యగృహాలు 
పాలిచ్చే తల్లుల సదుపాయం కోసం పర్యాటక స్థలాల్లో ‘స్తన్యగృహాలు’ ఏర్పాటుచేయనున్నట్లు భారత పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఎ.ఎస్.ఐ) ప్రకటించింది. తొలి విడతగా తాజ్ మహల్, ఆగ్రాఫోర్ట్, ఫతేపూర్ సిక్రీలలో ఈ స్తన్యగృహాల నిర్మాణం జరుగుతుందని తెలిపింది. చారిత్రక సందర్శన స్థలాల్లో ఎ.ఎస్.ఐ. ఇలా స్తన్యగృహాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. లైట్, ఫ్యాను, కుర్చీ, టేబులు వంటి కనీస సదుపాయాలు స్తన్యగృహాల్లో ఉంటాయి. నిరంతరం మనుషులు మసులుతుండే చారిత్రక కట్టడాల్లో బిడ్డకు స్తన్యమివ్వడానికి ‘చాటు’ కోసం వెతుక్కోవడం, పొదల వెనుకకు వెళ్లడం వంటి ఇబ్బందులను తల్లులు ఎదుర్కొంటున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పర్యాటక స్థలాల్లో స్తన్యగృహాలు
ఎప్పుడు : మే 21
ఎవరు : భారత పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఎ.ఎస్.ఐ)
ఎందుకు : పాలిచ్చే తల్లుల సదుపాయం కోసం

అరుణాచల్‌లో ఉగ్రవాదుల కాల్పులు 
అరుణాచల్ ప్రదేశ్‌లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్) ఉగ్రవాదులు మే 21న కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక ఎమ్మెల్యే సహా పదిమంది మృతి చెందారు. ఖోన్సా వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే తిరోంగ్ అబోహ్(41)(నేషనల్ పీపుల్స్ పార్టీ-ఎన్‌సీపీ అభ్యర్థి) మే 21న ఉదయం అస్సాం నుంచి తన కుటుంబసభ్యులతో కలిసి వాహనంలో వస్తుండగా తిరాప్ జిల్లాలో నాగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎమ్మెల్యే తిరోంగ్, ఆయన కొడుకు, భద్రతా సిబ్బంది ఒకరు సహా మొత్తం 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉగ్రవాదుల కాల్పులు
ఎప్పుడు : మే 21
ఎవరు : నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్)
ఎక్కడ : తిరాప్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్

శంషాబాద్ విమానాశ్రయానికి 8వ స్థానం Current Affairsప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 8వ స్థానం లభించింది. 2019 సంవత్సరానికి రూపొందించిన విమానాశ్రయాల ర్యాంకింగ్‌లను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ మే 10న విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానం, గీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్‌లను ఇచ్చారు. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే నిర్వహించి ఈ జాబితా ఎయిర్‌హెల్ప్ రూపొందించింది.
ఎయిర్‌హెల్ప్ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితా-2019 
ర్యాంకు
విమానాశ్రయం పేరు
దేశం
1
హమద్ ఎయిర్‌పోర్ట్
ఖతార్
2
టోక్యో ఎయిర్‌పోర్ట్
జపాన్
3
ఏథెన్స్ ఎయిర్‌పోర్ట్
గ్రీస్
4
అఫోన్సో పెనా
బ్రెజిల్
5
గాన్స్ లెచ్ వలేసా
పోలాండ్
6
షెరెమెటేవో ఎయిర్‌పోర్ట్
రష్యా
7
షాంఘి ఎయిర్‌పోర్టు
సింగపూర్
8
రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్
భారత్
9
టెనెరిఫె నార్త్
స్పెయిన్
10
విరాకోపస్/కాంపినస్
బ్రెజిల్
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో 8వ స్థానం
ఎప్పుడు : మే 11
ఎవరు : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ గడువు పెంపు 
అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించింది. ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరగా దీనికి కోర్టు అంగీకరించింది. ఏళ్లుగా అయోధ్య కేసు పెండింగ్‌లోనే ఉందని, సామరస్య పరిష్కారానికి మరింత సమయం ఇస్తే తప్పేముందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.
అయోధ్య కేసులో సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దాదాపు 8 వారాల పాటు విచారణ చేపట్టిన అనంతరం మే 7న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. ఈ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ కలీఫుల్లా ఉండగా సభ్యులుగా శ్రీశ్రీ రవిశంకర్, న్యాయవాది శీరాం పంచూ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వ గడువు పెంపు
ఎప్పుడు : మే 11
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరినందుకు

టీహెచ్‌ఈ ర్యాంకింగ్స్ లో 49 భారతీయ సంస్థలు Current Affairsఆసియాలోని విశ్వవిద్యాలయాలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) ఇచ్చే ర్యాంకింగ్స్ లో 49 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు మే 2న టీహెచ్‌ఈ ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్‌లో చైనాకు చెందిన సింఘువా యూనివర్సిటీ తొలిస్థానంలో నిలిచింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఈసారి కూడా 29వ ర్యాంకును పొందింది. అలాగే ఐఐటీ ఇండోర్ 50వ ర్యాంకు, ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 54వ ర్యాంకు, జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 62వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 76వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 82వ ర్యాంకు, ఐఐటీ ఢిల్లీ 91వ ర్యాంకు సాధించాయి.
2018లో భారత్‌కు చెందిన 42 విద్యా సంస్థలు టీహెచ్‌ఈ జాబితాలో చోటు దక్కించుకోగా, ఈసారి ఆ సంఖ్య 49కి పెరిగింది. దీంతో 2019 ఏడాదిలో జపాన్ (103), చైనా (72) తర్వాత ఎక్కువ సంస్థలతో ప్రాతినిధ్యమున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీహెచ్‌ఈ ర్యాంకింగ్స్ లో 49 భారతీయ సంస్థలు 
ఎప్పుడు : మే 2
ఎవరు : టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ)
ఎక్కడ : ఆసియా
వేదాంత దేశికులు స్మారక తపాలా బిళ్ల విడుదల 
వేదాంత దేశికులు 750వ జయంతి సందర్భంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మే 2న ఢి ల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... భారతీయ వాజ్ఞ్మయాన్ని అవపోసన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంత దేశికులని, ఆయన ఆధ్యాత్మిక గురువే కాదని, అంతకు మించిన దార్శనికుడని కొనియాడారు. మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చిన తత్వవేత్తల్లో ప్రముఖులని పేర్కొన్నారు. 20ఏళ్ల వయసులోనే వేదవేదాంగాలు, దివ్య ప్రబంధాలు, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస, యోగ, సంఖ్యా, వ్యాకరణాలను ఆయన అవపోసన పట్టారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వేదాంత దేశికులు స్మారక తపాలా బిళ్ల విడుదల
ఎప్పుడు : మే 2
ఎవరు : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : వేదాంత దేశికులు 750వ జయంతి సందర్భంగా

ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి 
గుజరాత్‌లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో మే 2. ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ-5 రకం బంగాళదుంపలను పండించారు. అయితే ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేసింది. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది.

పూరీ సమీపంలో తీరం దాటిన ఫొని 
ఒడిశాలోని పూరీ సమీపంలో మే 3న ఫొని తుపాను తీరం దాటింది. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ఫొని తీరం దాటే సమయంలో గంటకు 175-205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. ఈ తుపాను కారణంగా ఎనిమిది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతితీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ మే 4 నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది.
పెనుగాలులు.. కుండపోత వర్షాలు.. 
ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసం కాగా వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ముందస్తు చర్యగా 11 లక్షల మంది బాధితులను ఒడిశా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఫొని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. ఫొని తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో సహాయక కార్యక్రమాల కోసం ముందస్తుగా రూ. 1,000 కోట్లు విడుదల చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఫొని తుపాను పేరును బంగ్లాదేశ్ సూచించగా, ఫొని అనే పదానికి పాము పడగ అని అర్థం వస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తీరం దాటిన ఫొని తుపాను
ఎప్పుడు : మే 3
ఎక్కడ : పూరీ సమీపం, ఒడిశా

సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణలపై నివేదిక 
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై 14 రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ మే 5న తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. సీజేఐపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు లేవని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సీజేఐ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించింది. దీంతో జస్టిస్ బాబ్డే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రస్తుతం జడ్జీలు జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఇందిరా బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఆయన సభ్యుడిగా ఉండటంపై మహిళా ఉద్యోగి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కమిటీ నుంచి ఆయన తప్పుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీజేఐ లైంగిక వేధింపుల ఆరోపణలపై నివేదిక
ఎప్పుడు : మే 5
ఎవరు : సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం 
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర మే 7న ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్-నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్- మే నెలల్లో తిరిగి తెరుస్తారు. మే 7న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవగా మే 9న కేదార్‌నాథ్ ఆలయాన్ని, మే 10న బద్రీనాథ్ ఆలయాన్ని 10న తెరవనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఎప్పుడు : మే 7
ఎక్కడ : ఉత్తరాఖండ్
ఎందుకు : యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాల సందర్శనకోసం

విపక్షాల రివ్యూ పిటిషన్ తిరస్కరణ 
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ అంశంపై 21 ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం మే 7న విచారించింది.

No comments:

Post a Comment